నేడు, రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోభారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

depression-continues-on-bay-of-bengal

అమరావతిః బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా దిశగా పయనించే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఇప్పటికే ప్రారంభమైందని, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ జిల్లాల్లో తేలికపాటివర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వివరించింది.

అటు, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కూడా వాయుగుండంపై తాజా బులెటిన్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 420 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ సాయంత్రానికి ఇది మరింత బలపడుతుందని, అయితే ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువగా వచ్చే కొద్దీ, రేపటి ఉదయానికి బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది. నేడు, రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 23న రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/