ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ ల పర్వం మొదలైంది..విజ‌య్ నాయ‌ర్‌ ఫస్ట్ అరెస్ట్

దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ ల పర్వం మొదలైంది. ఈ కేసులో మంగ‌ళ‌వారం రోజు తొలి అరెస్ట్ న‌మోదైంది. ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ సీఈవోగా ప‌నిచేస్తున్న విజ‌య్ నాయ‌ర్‌ ను అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవ‌లు అందిస్తున్న ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ కంపెనీ.. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇప్పటికే లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు విజయ్ నాయర్ సన్నిహితుడని సమాచారం. విజయ్ నాయర్ తరపున లిక్కర్ వ్యాపారీ సమీర్… మనీశ్ సిసోడియా అనుచరుడైన అర్జున్ పాండేకు ముడుపులు అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రామచంద్రపిళ్లై సహా.. 15మంది నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ పై ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తోంది. కేసు ద‌ర్యాప్తులో భాగంగా విజ‌య్ నాయ‌ర్‌కు చెందిన కీల‌క ఆధారాలు ల‌భించ‌డంతో.. ఆయన్ను సీబీఐ ముంబైలో అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ముంబై నుంచి ఢిల్లీకి త‌ర‌లించింది. అయితే.. ఈ కేసులో తొలి అరెస్టు నమోదు కావడంతో.. తర్వాత ఎవరన్న చర్చ నడుస్తోంది.