బిజెపి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఢిల్లీ హైకోర్టు

Delhi HC to pass order on plea by BJP MLAs against suspension today

న్యూఢిల్లీః బిజెపి ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఏడుగురిపై విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు రద్దు చేసింది. సస్పెన్షన్‌ను ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్‌ చేయగా ఈ మేరకు కోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 15న ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ విజయ్‌ సక్సేనా ప్రసంగిస్తున్న సమయంలో గందరగోళం చెలరేగగా.. ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. దాంతో ఎమ్మెల్యేలు అదే నెలలో కోర్టు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు 27న నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసింది.

ఏడుగురు ఎమ్మెల్యేల్లో మోహన్ సింగ్ బిష్త్, అజయ్ మహావార్, ఓపీ శర్మ, అభయ్ వర్మ, అనిల్ వాజ్‌పేయి, జితేంద్ర మహాజన్, విజేందర్ గుప్తా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమను సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విపక్ష సభ్యులను చర్చలో పాల్గొనకుండా చేసేందుకు దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వం సస్పెండ్‌ చేసినట్లు వాదించారు. అయితే, ఆప్‌ ప్రభుత్వ విజయాలను బడ్జెట్‌ ప్రసంగంలో ఎల్‌జీ చదువుతున్న సమయంలో ఎమ్మెల్యేలు అంతరాయం కలిగించారు. ఈ క్రమంలో స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేశారు. ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది జయంత్ మెహతా సస్పెన్షన్ రాజ్యాంగం, నిబంధనలకు విరుద్ధమని వాదించారు.