మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Delhi excise policy case: Court adjourns hearing on Manish Sisodia’s bail plea till April 5

న్యూఢిల్లీః ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా కు మరో షాక్‌ తగిలింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు లో సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తీహార్‌ జైలులో ఉన్న ఆయన్ని ఈడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం విచారణ చేపట్టిన స్పెషల్‌ జడ్జ్‌ నాగ్‌పాల్‌.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్‌ 5కు వాయిదా వేశారు.

సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఈడీ స్పందన తమకు అందలేదని సిసోడియా తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్ పై ఈడీ స్పందన తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు సిసోడియా తరపు న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ కోర్టుకి తెలిపారు. ఇందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 5కు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మార్చి9న మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు, ముడుపుల వ్యవహారంపై సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. 12 రోజుల పాటు కస్టడీలో మనీశ్ సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. ప్రస్తుతం సిసోడియా తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.