తెలంగాణ కంటి వెలుగు పథకంపై కేజ్రీవాల్‌ ప్రశంసలు

ఢిల్లీలోనూ కంటి వెలుగు అమలు చేస్తాం.. సీఎం కేజ్రీవాల్‌

delhi-cm-arvind-kejriwal-appreciated-kanti-velugu

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కంటి వెలుగు పథకంపై ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించడం అభినందనీయమని ప్రశంసించారు. సమస్యల పరిష్కారానికి ఒక రాష్ర్టాన్ని చూసి మరో రాష్ట్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బుధవారం ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన రిపబ్లిక్‌డే కార్యక్రమంలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. కేంద్రం నియమిస్తున్న గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు ప్రజల ద్వారా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తూ వాటి విధులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్యానికి వీరొక అజ్ఞాత నీడలా పరిణమిస్తే పాలన ఎలా సాధ్యమంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి లాత్‌ సాహెబ్‌ (గవర్నర్లు, ఎల్‌జీలు)ల గురించి ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించాలో మనమందరం ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అటు న్యాయవ్యవస్థతోపాటు ఇటు విపక్ష పాలిత రాష్ర్టాలతో నిత్యం ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నదని ఆయన విమర్శించారు. రైతులు, వ్యాపారులతో సైతం ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నదన్నారు. కేంద్రం ఆహార వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించాలని, అలా చేస్తే దేశంలోని చాలామందికి మేలు జరుగుతుందని కేజ్రీవాల్‌ అన్నారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, చైనాతో భారత వాణిజ్యం 50 శాతం పెరిగిందని పేర్కొన్నారు. పొరుగుదేశానికి గట్టి సందేశం పంపేందుకు ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/