దగ్గుమందు మరణాలు భారత పరిశోధన రంగానికి మచ్చే: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

భారత్‌లో తయారైన దగ్గుమందు తీసుకుని జాంబియాలో 66 మంది మృతి చెందినట్టు ఆరోపణ

Death of 66 children in Gambia has brought unimaginable shame to India: Narayana Murthy

న్యూఢిల్లీః భారత్‌లో తయారైన దగ్గుమందు తీసుకుని జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందడంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు. బెంగళూరులో నిన్న నిర్వహించిన ఇన్ఫోసిస్ సైన్స్ పురస్కారాల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో తయారైన దగ్గుముందు జాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైందని ఆఫ్రికా ఆరోపించడం భారత్‌కు సిగ్గుచేటన్నారు.

కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసిన మనకు దగ్గుమందు అపవాదు భారత పరిశోధన రంగానికి మచ్చ తీసుకొచ్చిందని అన్నారు. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న గున్యా, డెంగీలకు ఇప్పటి వరకు టీకాలు కనుగొనకపోవడం పరిశోధన రంగం వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. విజ్ఞాన పరిశోధనల్లో సమన్వయ లోపంతోపాటు నిధులు పొందడంలో విద్యాసంస్థలు అవస్థలు పడుతున్నాయని, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సకాలంలో పొందలేకపోతున్నాయని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాలను ఆరుగురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. వీరిలో సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్), సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్సెస్), మహేశ్ కాక్డే (గణితం), నిస్సీమ్ కనేకర్ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్ సైన్స్)లకు పురస్కారాలు ప్రకటించారు. వీరికి జనవరిలో పురస్కారాలతోపాటు స్వర్ణ పతకం, లక్ష అమెరికన్ డాలర్లు అందిస్తారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/