హత్యాచారాలకు మరణమే సిసలైన శిక్ష!

Death Is Serious Punishment

చట్టం ముందు అందరూ సమానులే. న్యాయం ఏ ఒక్కరి సొత్తుకాదు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అసాంఘిక కార్య కలాపాలకు ఒడిగట్టే నేరస్తులను కఠినంగా శిక్షిం చాల్సిందే. అందులోనూ మహిళలపై లైంగికవేధింపులు రోజురోజుకూ ఉధృతం అవుతున్న తరుణంలో అరెస్టులు, విచారణల్లో నేరం రుజువైన వెంటనే వారికి కఠిన శిక్షలు పడాల్సిందే.

విచారణ పేరిట ఏళ్లతరబడి తాత్సారం లేకుండా కేవలం దారుణం జరిగిన 67 రోజుల్లోనే విచారణ జరిపి శిక్ష విధించిన అత్యంత అరుదైన కేసుగా అదిలాబాద్‌ సమత కేసు నిలిచింది. నిందితులకు మరణ శిక్షను ఖరారుచేసి న్యాయస్థానం ముగ్గురు దోషులకు అమలు చేయాలని తీర్పుచెప్పింది. అంతేకాకుండా ముగ్గురు దోషుల నుంచి 26వేల రూపాయలు జరిమానా రూపంలో కూడా వసూలు చేయాలని ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలు జారీచేసారు.

అటవీప్రాంతంలో వివాహిత గిరిజన మహిళను అత్యంత ఘోరంగా సామూహిక అత్యాచారం చేసి ఆపై కత్తితో పొడిచి చంపి తమ పైశాచికత్వాన్ని నిందితులు బైటపెట్టుకున్నారు. గత ఏడాది నవంబరులో కుమురంభీం జిల్లా లింగాపూర్‌ మండల ఎల్లపటార్‌ గ్రామసమీపంలో జరిగిన అత్యా చారం సంఘటనపై ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం చకచకా దర్యాప్తును పూర్తిచేసి కోర్టుకు నిందితులను హాజరుపరిచింది.

నెలరోజుల్లోపే నిందితులపై నేరారోపణలతో కూడిన అభియోగపత్రాన్ని పోలీసులు కోర్టుకు దాఖలుచేస్తే అదేనెల 23నుంచి 31 వరకూ ఏకబిగిన సాక్షుల విచారణ కొనసాగించారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి పదిరోజుల్లోనే ప్రాసిక్యూషన్‌ డిఫెన్స్‌ వాదనలు ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి విన్నారు. తదనంతరం తీర్పును రిజర్వులో ఉంచి గురువారం నిందితులకు మరణమేసరైన శిక్ష అని ఖరారుచేసారు. ఆనాడు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేవిధంగా హత్యాచారానికి పాల్పడినప్పుడు లేని భయం, కుటుంబ నేపథ్యం శిక్షపడే సమయంలో గుర్తుకువచ్చింది.

అయితే పాశవికంగా నిందితులు పాల్పడిన నేరం అత్యంత ఘోరమైనదని న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌ వాదనతో ఏకీభవించారు. చరిత్రలో ఏళ్లతరబడి నలుగుతున్న కేసులతో నిందితులు చట్టాల్లో ఉన్న సదుపాయాలను అడ్డంపెట్టుకుని శిక్షనుంచి తప్పించుకుంటున్న సంఘట నలు కోకొల్లలు. అంతెందుకు 2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన ఘోరమైన పాశవికమైన అత్యాచారం సంఘటన ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది.

నిందితులను సకాలంలోనే అరెస్టులుచేసి విచారణ సత్వరమే ముగించి నలుగురికీ ఉరిశిక్షను ఖరారు చేసినా ఇప్పటికీ అమలుకాలేదు. నిర్భయ తల్లితండ్రులుసైతం నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ బిడ్డకు న్యాయం చేయాలని అర్థిస్తూనే ఉన్నప్పటికీ నిందితులకు మాత్రం చట్టపరిధిలో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చేనెల ఒకటిన అమలుకావాల్సిన ఉరిని తప్పించుకునేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు.

న్యాయవ్యవస్థ పటిష్టంగా పనిచేస్తున్నందున కొంతలో కొంత బాధితులకు న్యాయం జరుగుతుందనే భావించాలి. నిర్భయ దోషులు కొనసాగిస్తున్న కార్యాచరణకు ఎప్పటికప్పుడు అడ్డంకులు పడుతూనే ఉన్నాయి. అయితే రెండోసారి జారీ అయిన డెత్‌వారంట్‌ అమలవుతుందా మళ్లీ వాయిదా పడుతుందా అన్నదే ఇప్పుడు ఢిల్లీకేసులో నలుగుతోంది.

ఇక సమత కేసుపరంగాచూస్తే నిందితు లకు ఉరే సరి అని గ్రామస్తుల నుంచి సభ్యసమాజం మొత్తం ఏకరువుపెట్టింది. సమత ఆత్మకు శాంతి చేకూరాలంటే దోషులకు ఉరిశిక్ష విధించాలని కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు మొత్తం గొంతెత్తి నినదిం చారు. వారి ఆక్రోశం ఆవేదనకు అనుగుణంగానే న్యాయమూర్తి కేసు పూర్వాపరాలను సమగ్రంగా పరిశీలించి ఇరుపక్షాల వాదనలను విన్నతర్వాత ఉరిశిక్షను ఖరారుచేసారు.

అయితే దోషులకు అప్పీలు అవకాశం ఉండటంతో వీరు అప్పీలుచేసుకుంటూ సుప్రీంకోర్టువరకూ వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. నిర్భయ కేసు తరహాలోనే సమత కేసు కూడా ముందుకు సాగుతుందా లేక దోషులకు మరణశిక్ష అమలవుతుందా అన్నది ఇప్పుడు కాలమే నిర్ణయించాలి. మహిళలపై లైంగిక వేధింపులు, హత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు దేశంలో కోకొల్లలుగా పెరిగిపోయాయి. ఉత్తరాదిలో ఢిల్లీ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. మతపరమైన ఘర్షణలు ఓపక్క అట్టుడికిపోతుంటే

మరోపక్క ఇలాంటి లైంగికవేధింపులు, అత్యాచారం ఆపై హత్యకేసులు సభ్యసమాజాన్ని కలవరపెడుతున్నాయి. కొంతలో కొంత తెలుగు రాష్ట్రాల్లో సత్వర విచారణలు జరుగుతున్నాయని సమత కేసు విచారణ తీరు తెన్నులు చూస్తే స్పష్టం అవుతుంది. సాక్ష్యాధారాలతో నిరూపించి కేసుల్లో మరణశిక్షలు పడుతున్నప్పటికీ దోషులు చట్టాల్లోని లొసుగులు తమకు ఆసరాగా చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినవారికోసం పోక్సోచట్టం అమలులో ఉంది. రాజస్థాన్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో బాలికలపై హత్యాచారాలకు పాల్పడేవారికి నేరం రుజువైతే మరణ శిక్షనే అమలు చేయాలని చట్టాలను సైతం సవరించాయి. ఎంతమేర ప్రభుత్వాలు చట్టాలకు సవరణలు చేసి కఠిన శిక్షలు అమలుచేస్తున్నా జరిగే ఘోరాలు, దారుణాలు జరిగిపోతూనే ఉన్నాయి.

నేరం జరిగిన వెంటనే సమతకేసు తరహాలో విచారణ సత్వరమే ముగించడం తోపాటు దోషులకు విధించిన శిక్షలను సైతం సత్వరమే అమలుచేస్తే ఇటువంటి కేసుల్లో కొంతవరకూ సమూలం గా నిర్మూలించలేకపోయినా కనీసం కట్టడిచేయగలమని చెప్పగలం. ఇపుడు దేశవ్యాప్తంగా సమత కేసు విచారణ తీరు ఇలాంటి ఇతర కేసుల విచారణకు స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/