ఆస్ట్రేలియా, ఫేస్​ బుక్ మధ్య ఒప్పందం

త్వరలోనే న్యూస్ పేజీలను పునరుద్ధరిస్తామని వెల్లడి

మెల్‌బోర్న్‌: ఫేస్ బుక్, ఆస్ట్రేలియా ప్రభుత్వం మధ్య సంధి కుదిరింది. వార్తలను మళ్లీ షేర్ చేసేందుకు ఓకే చెప్పింది. వార్తా సంస్థలకు చెల్లింపులు చేస్తామని వెల్లడించింది. దీనిపై న్యూస్ పార్ట్ నర్ షిప్ విభాగపు అధిపతి క్యాంప్ బెల్ బ్రౌన్ అధికారిక ప్రకటన జారీ చేశారు. అయితే, ఎంత ఇచ్చేది? ఎవరికి ఇచ్చేది? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. వార్తలు షేర్ చేస్తే ఆయా సంస్థలకు సోషల్ మీడియా సంస్థలు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా చట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఫేస్ బుక్ సహా పలు సోషల్ మీడియా సైట్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ వార్తలను షేర్ చేయకుండా బ్లాక్ చేసింది కూడా. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో ఫేస్ బుక్ రాజీ కుదుర్చుకుంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వంతో అన్ని విషయాలపైనా చర్చలు జరిపామని, చిన్న, స్థానిక సంస్థలు సహా తాము ఎంపిక చేసుకున్న వార్తా సంస్థలకే తోడ్పాటు అందించేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని బ్రౌన్ చెప్పారు. రాబోయే రోజుల్లో న్యూస్ ఫీడ్ పేజీలను పునరుద్ధరిస్తామని తెలిపారు. అయితే, ఏ వార్త ఫేస్ బుక్ లో కనిపించాలో తుది నిర్ణయం తమదేనని ప్రభుత్వానికి తేల్చి చెప్పామని, బలవంతంగా తమపై దేనినీ రుద్దొద్దని కోరామని అన్నారు. ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా జర్నలిజానికి తమ మద్దతు ఉంటుందని, అందులో పెట్టుబడులకూ సిద్ధమేనని చెప్పారు. అయితే, పబ్లిషర్, ఫేస్ బుక్ లాంటి ప్లాట్ ఫాంలది అవినాభావ సంబంధమని, కానీ, తమ ప్రమేయం లేకుండా ఇలాంటి చట్టాల విషయంలో పెద్ద పెద్ద మీడియా సంస్థలు ముందుకు పోవడం మంచిది కాదని బ్రౌన్ తేల్చి చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/