40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ ను ముట్టడిస్తాం..రాకేశ్​ తికాయత్​

తేదీలను త్వరలోనే యునైటెడ్ ఫ్రంట్ ఖరారు చేస్తుంది

న్యూఢిల్లీ: సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే పార్లమెంట్ ను ముట్టడిస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. ఢిల్లీ వైపు సాగేందుకు రైతులంతా సిద్ధంగా ఉండాలని, ఏ క్షణమైనా ఢిల్లీ ముట్టడి పిలుపు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రాజస్థాన్లోని శిఖర్ లో యునైటెడ్ కిసాన్ మోర్చా నిర్వహించిన కిసాన్ మహాపంచాయితీలో ఆయన మాట్లాడారు.

ఈసారి 4 లక్షల ట్రాక్టర్లు కాదు.. 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ ను ముట్టడిస్తామని తికాయత్ హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళన చేస్తున్న రైతులు ఇండియా గేట్ వద్ద పార్కులను దున్ని పంటలు పండిస్తారని అన్నారు. పార్లమెంట్ ముట్టడి తేదీని యునైటెడ్ ఫ్రంట్ నిర్ణయిస్తుందని చెప్పారు. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసను అడ్డుపెట్టుకుని రైతులకు మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

దేశ రైతులు త్రివర్ణ పతాకాన్ని ప్రేమిస్తారు కానీ.. దేశ నేతలను కాదని అన్నారు. చట్టాలు రద్దు చేయకపోతే పెద్ద పెద్ద కంపెనీల గోదాములను కూల్చిపారేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వాటిని కూల్చేందుకు తేదీలతో సిద్ధమవుతామని తేల్చి చెప్పారు. ఆ తేదీలనూ తొందర్లోనే ఖరారు చేస్తామన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/