రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తొలగించడం బాధేసింది – పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధువారం విజయవాడ లో పర్యటించారు. తన ఎన్నికల ప్రచార వాహనం వారాహి కి పూజా కార్య క్రమాల నిమిత్తం విజయవాడ కు చేరుకున్నారు. కనక దుర్గమ్మ ఆలయంలో పూజల అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో రూ. 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా అని నిలదీశారు. ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా అని పవన్‌ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతాడని, అలా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అన్నారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు నీళ్లు ఇవ్వడానికి ఒక బ్రిటీష్ మహిళ నిరాకరించిందని అన్నారు.