అర్ధరాత్రి దాసోజు శ్రవణ్‌ కు రేవంత్ రెడ్డి అనుచరులం అంటూ బెదిరింపు కాల్స్

హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ గారికి గత అర్ధరాత్రి రేవంత్ రెడ్డి అనుచరులం అంటూ కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. ఫోన్లో అసభ్య పదజాలం వాడుతూ..రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై శ్రవణ్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నారు.

ఈ బెదిరింపు కాల్స్ ఫై శ్రవణ్ స్పందిస్తూ..బెదిరింపు కాల్స్ ఫై విచారణ జరిపి దోషులను గుర్తించి, వారిపై చట్టపరమైన పరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉండడం దురదుష్టకరం అని ఆయన అన్నారు. గతంలో వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి తదితర సీనియర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై కూడా ఇలాగే రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి బెదిరింపు చర్యలు చేపట్టడం రేవంత్ కు కొత్తమే కాదు.

ఈ రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు సరైనవి కావు. ప్రజాస్వామ్యం కోసం , న్యాయం కోసం పోరాడుతున్న నన్ను ఎవ్వరు అడ్డుకోలేరని రేవంత్ తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రౌడీ లను ప్రోత్సహించడం ఆశ్చర్యమేస్తుంది అని శ్రవణ్ అన్నారు. గత నాల్గు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఫై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్ చేసిన కామెంట్స్ ఫై బిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం సబ్ స్టేషన్ల వద్ద తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదంటూ ఆందోళనలు చేపట్టింది. ఇలా ఇరు పార్టీలు ఆందోళనలు , నిరసనలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సాగుకు 3 గంటల కరెంట్‌ చాలని అవమానపర్చిన రేవంత్‌రెడ్డి బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్‌ పాలిత కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో ముందుగా 24 గంటల ఉచిత కరెంట్‌ ఇచ్చి, తెలంగాణలో మాట్లాడాలని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి మూర్ఖుడని, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని , రేవంత్‌ కాంగ్రెస్‌కే కాదు.. తెలంగాణకు, సభ్య సమాజానికి పట్టిన శనిగా అభివర్ణించారు. బుద్ధి, జ్ఞానం, సభ్యత, సం స్కారం లేకుండా మాట్లాడుతున్న సన్నాసి అంటూ మండిపడ్డారు.