బీజేపీలో తీర్థం పుచ్చుకున్న దాసోజు శ్రవణ్

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరు వల్లే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నిన్న శనివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ కి వెళ్లిన ఆయన.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్తో భేటీ అయ్యారు. అనంతరం శ్రవణ్కు శాలువా కప్పి తరుణ్ చుగ్ సత్కరించారు. బీజేపీ విద్యార్థి పరిషత్ తో పనిచేసిన శ్రవణ్ తో చాలాకాలం తర్వాత భేటీ కావడం సంతోషం కలిగించిందని అన్నారు.

ఈరోజు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ..దాసోజుశ్రవణ్‌కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రాబోయే ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బిజెపి నుండి దాసోజు శ్రవణ్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక దాసోజు శ్రవణ్ రాజకీయరంగ విషయానికి వస్తే..ప్రజా రాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రవణ్.. కొద్ది రోజుల్లోనే మంచి సబ్జెక్ట్ ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న శ్రావణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 91 వేల ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో ఆయన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. చేరిన కొద్ది కాలంలోనే ఆయన కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహితుడిగా మారారు. టీవీ చర్చల్లో, వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఆయన. అయితే.. టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ను ఆశించిన శ్రవణ్.. టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురై పార్టీని వీడారు.

తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి.. అక్కడ కూడా తక్కువ కాలంలోనే అధిష్టానం ఆశిస్సులు పొందారు. దీంతో ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది హై కమాండ్. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని సైతం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఖైరతాబాద్ కు చెందిన మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో మనస్థాపానికి చెందిన శ్రావణ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు బీజేపీలో జాయిన్ అయ్యారు.