రాజస్థాన్‌ వైపుకు మళ్లిన ’బిపర్‌జోయ్’ తుపాను

రాజస్థాన్‌లో నేడు, రేపు భారీ వర్షాలు

Cyclone ‘Biparjoy’ headed towards Rajasthan

న్యూఢిల్లీః నిన్న గుజరాత్ తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను బిపర్‌జోయ్ విధ్వంసం సృష్టిస్తోంది. తీరాన్ని తాకిన తర్వాత అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుకు మారింది. గుజరాత్‌లో విధ్వంసం సృష్టించిన తర్వాత రాజస్థాన్‌కు మళ్లింది. ఫలితంగా నేడు, రేపు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.

తుపానుకు కారణంగా భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నం చేసిన పశువుల యజమాని, అతడి కుమారుడు మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. 23 జంతువులు మృత్యువాత పడ్డాయి. ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 524 చెట్లు కుప్పకూలాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

15 ఎన్డీఆర్ఎఫ్, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయుసేన, నేవీ, ఆర్మీ, కోస్ట్‌గార్డ్, బీఎస్ఎఫ్ సిబ్బంది తుపాను సహాయక చర్యల్లో ఉన్నారు. తుపాను నేపథ్యంలో పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలెర్టులను వాతావరణశాఖ జారీ చేసింది. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేశారు.