హ‌ర్యానాలోని నుహ్ జిల్లాలో క‌ర్ఫ్యూ విధింపు

curfew-imposed-in-haryana-violence-hit-nuh-district

గురుగ్రామ్‌: గత రాత్రి నుంచి హ‌ర్యానా లోని నుహ్ జిల్లాలో క‌ర్ఫ్యూ విధించారు. సోమ‌వారం అక్క‌డ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే రాత్రి పూట ఎటువంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని డీసీ ప్ర‌శాంత్ ప‌న్వార్ తెలిపారు. రాత్రిపూట పోలీసులు ప‌హారా కాశారు. నుహ్ జిల్లాలో ఉన్న 8 పోలీసు స్టేష‌న్ల‌లో ఛార్జ్ తీసుకోవాల‌ని ఐపీఎల్ ఆఫీస‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఖేడ్లా గ్రామంలో ప్ర‌స్తుతం పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. అరెస్టుల నుంచి త‌ప్పించుకునేంద‌కు ఆందోళ‌న‌కారులు స‌మీప ప‌ర్వ‌తాల‌వైపు ప‌రారీ అయిన‌ట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న వీడియోల ఆధారంగా నిందితుల్ని అరెస్టు చేస్తున్న‌ట్లు ఎస్పీ న‌రేంద్ర బిజ‌ర్నియా తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లో ఉన్న ఓ మ‌త‌ప‌ర‌మైన బిల్డింగ్‌కు నిప్పుపెట్టారు. ఆ ప్ర‌మాదంలో ముగ్గురికి గాయాల‌య్యాయి.

సోమ‌వారం వీహెచ్‌పీ ర్యాలీని నుహ్ జిల్లాలో ఓ వ‌ర్గం వారు అడ్డుకున్నారు. ఆ స‌మ‌యంలో ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. ఆ దాడుల్లో ఇద్ద‌రు హోంగార్డులు మృతిచెందారు. మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డారు. ఇరు వ‌ర్గాల వాళ్లు రాళ్లు రువ్వుకున్నారు, కార్ల‌కు నిప్పుపెట్టారు. నుహ్ జిల్లాలో శాంతి భ‌ద్ర‌త స్థాప‌న కోసం 20 కంపెనీల రాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ ద‌ళాలు కావాలంటూ కేంద్రాన్ని హ‌ర్యానా స‌ర్కార్ కోరింది. సోహ్నా, మ‌నేశ్వ‌ర్‌, ప‌టౌడి ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేశారు. హ‌ర్యానా హింస‌కు చెందిన ఘ‌ట‌న‌ల్లో పోలీసులు 20 కేసుల్ని న‌మోదు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మృతుల సంఖ్య నాలుగుకు చేరుకున్న‌ది. తాజాగా గురుగ్రామ్‌లో మ‌సీదుపై దాడి జ‌రిగినట్లు తెలుస్తోంది.