నీటి కోసం ఎన్నేళ్లు పోరాడాలని ప్రశ్నించడం నేరమా?: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే

శింగనమల అభివృద్ధికి సీఎం జగన్ సహకరించట్లేదని ఆవేదన

singanamala-mla-padmavati-fires-on-own-govt

అమరావతిః సిఎం జగన్ పై సొంతపార్టీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి లీడర్, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోమవారం సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో సొంత ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. శింగనమల నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ సహకరించడంలేదని, ఎస్సీ నియోజకవర్గమని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే సీఎం నడుచుకుంటున్నారని ఆరోపించారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె క్షమాపణలు తెలిపారు.

శింగనమల నియోజక వర్గానికి నీళ్లు తెచ్చుకోవడానికి ప్రతిసారీ యుద్ధం చేయాల్సి వస్తోందని ఎమ్మెల్యే పద్మావతి ఆరోపించారు. 2019-20 ఏడాదిలో ఒకసారి కంటితుడుపుగా, అది కూడా సీఎం ఆఫీసు చుట్టూ తాను పట్టువదలకుండా తిరగడంతో నీళ్లిచ్చారని చెప్పారు. ఆ తర్వాత అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు. శింగనమల నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాలా? నీటి కోసం ఎన్నేళ్లు పోరాడాలని ప్రశ్నించడం నేరమా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నీటి కోసం అందరమూ కలిసి పోరాడదామని ఎమ్మెల్యే పద్మావతి పిలుపునిచ్చారు.