తిరుమలలో త‌గ్గుతోన్న భక్తుల ర‌ద్దీ

తిరుమలలో భక్తుల ర‌ద్దీ క్రమంగా తగ్గుతుంది. శని, ఆదివారాల్లో విపరీతమైన రద్దీ కారణంగా స్వయంగా టీటీడీ రంగంలోకి దిగి నాల్గు , ఐదు రోజుల పాటు భక్తులు శ్రీవారి దర్శనానికి రాకూడదని హెచ్చరిక జారీ చేసారు. ప్రస్తుతం భక్తుల ర‌ద్దీ తగ్గడం తో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు చెప్పుకొస్తున్నారు.

తిరుమలలో నిన్న మంగళవారం శ్రీవారిని 69,848 మంది భక్తులు దర్శించుకోగా 28,716 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు వచ్చిందని వివరించారు. 27న 72,758, 28న 73.358 మంది, 29న 89,318 మంది, 30న 90,885 మంది భక్తులు, 31న 74,823 మంది దర్శించుకున్నారని వెల్లడించారు.

మరోపక్క ఈరోజు (జూన్ 1 ) నుంచి తిరుమలలో అన్ని రకాల ప్లాస్టిక్‌లను నిషేధించింది. తిరుమలలోని దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో బుధవారం నుంచి సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు టీటీడీ అధికారి మల్లికార్జున ప్రకటించారు. ప్లాస్టిక్, సీసాలు, సంచులు మరియు షాంపూ సాచెట్‌లతో సహా ఈ నిషేధం వర్తిస్తుంది. నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి టిటిడికి సహకరించాలని దుకాణాల యజమానులను కోరిన మల్లికార్జున, అలిపిరిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని అన్నారు. ఇతర వస్తువులతో పాటు బట్టలు మరియు బొమ్మలను ప్యాకింగ్ చేయడానికి బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను ఉపయోగించాలని వ్యాపార యజమానులకు సూచించారు.