నిన్న ఒక్క రోజే ఎన్ని డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయో తెలుసా..?

తాగి వాహనాలను నడపవద్దని..దొరికితే భారీ ఫైన్ తో పాటు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు ఎంత చెప్పిన మందుబాబులు మాత్రం పోలిసుల హెచ్చరికలు ఏమాత్రం పట్టించుకోలేదు. తాగి వాహనాలను నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికారు. నిన్న (డిసెంబర్ 31) ఒక్క రోజే హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 3,416 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో 1,528, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,258, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులను నమోదు చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

ఇళ్లల్లో ఉండి పండుగలు జరుపుకోమని చెప్పినా.. కొందరు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఫలితంగా రోడ్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుందని వారిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. రాత్రి మొత్తం మందుబాబులు చేసిన హడావుడికి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకూ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. దీంతో నగర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్క రోజే భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతించడంతో నిన్న ఒక్కరోజే తెలంగాణలో 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మొత్తం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇక ఏపీలో 1.36 లక్షల కేసుల లిక్కర్, 53 వేల కేసుల బీర్లు కొనుగోలు చేశారు. మొత్తం రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది.