కేటీఆర్​పై పరువునష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయవద్దని బండి సంజయ్ కి కోర్ట్ ఆదేశం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పరువుకు భంగం కలిగే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశించింది.

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంపై తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని కేటీఆర్ తరుపు న్యాయవాది పిటిషన్​ వేశారు. మే 11న బండి సంజయ్ “భాజపా 4 తెలంగాణ” ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారని..మంత్రి నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు మరణిస్తే సీఎం స్పందించలేదని నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ ట్వీట్​ను ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ ట్విటర్​కు కూడా ట్యాగ్ చేశారన్నారు. బండి సంజయ్ ట్వీట్ విస్తృతంగా ప్రచారం జరగడం వల్ల కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పిటిషన్​లో న్యాయవాది తెలిపారు. అబద్ధమని తెలిసి కూడా సంచనలం కోసం కేటీఆర్, సీఎంపై సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.

ఓ జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా కేవలం ప్రచార యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కు ఆపాదించే ప్రయత్నం చేశారని న్యాయ‌వాది పేర్కొన్నారు. కేటీఆర్ ప‌రువుకు భంగం క‌లిగించేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేసిన సంజ‌య్.. సివిల్, క్రిమిన‌ల్ చ‌ట్టాల ప్రకారం కేటీఆర్‌కు ప‌రిహారం చెల్లించాల‌న్నారు. వీటితో పాటు చ‌ట్ట ప్రకారం త‌గిన చ‌ర్యలకు అర్హుల‌వుతార‌ని నోటీసుల్లో న్యాయ‌వాది తెలిపారు. 48 గంట‌ల్లో తన క్లైంట్ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల‌ని న్యాయ‌వాది డిమాండ్ చేశారు. ఇటు ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ‘కేటీఆర్‌ పరువుకు నష్టం కలిగేలా మీడియా, సామాజిక మాధ్యమాలు, ఇంటర్వ్యూలు, సభల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’ అని సంజయ్‌ను ఆదేశించింది.