తెలంగాణలోని పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది డాక్టర్స్ నియామకం

Private Doctors

తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం..ఆ దిశగా అడుగులేస్తోంది. ఏ రాష్ట్రంలో లేని రీతిగా ప్రజల ఆరోగ్యం ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే బస్తి దవాఖానాలు ఏర్పటు చేసిన ప్రభుత్వం..ఇప్పుడు పల్లెల్లో కూడా దవాఖానాలు ఏర్పటు చేయబోతుంది. ఇందుకోసం 1492 మంది డాక్టర్స్ నియామకం జరపబోతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 4,745 ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయంచింది. ఈ పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 1563 జారీ చేసింది. వీరి నియమకానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. పల్లె దవాఖానాల్లో అవసరమైన వ్యాధి నిర్ధార‌ణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని టీ డయాగ్నస్టిక్స్ కు పంపుతారు. అక్కడి నుండి వచ్చిన వ్యాధి నిర్ధారణ ఫలితాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్సను అందిస్తారు. ప్రాథ‌మిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ వ్యాధి తీవ్రత ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు సీహెచ్ సీ లేదా ఏరియా, జిల్లా ఆస్ప‌త్రులకు రిఫర్ చేయడం జరుగుతుంది.

రాష్ట్రంలోని 3,206 సబ్ సెంటర్లలో 1492 మంది వైద్యుల నియామకం చేయనుండగా, మరో 636 సబ్‌ సెంటర్లు పీహెచ్‌సీల పరిధిలోనే ఉన్నాయి. అంటే మొత్తంగా 3842 సబ్ సెంటర్లలో డాక్టర్‌ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారన్నమాట.