ఆ రాత్రి ప్రశాంతంగా ఉండలేకపోయా

చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ విఫలమైన తర్వాత నిద్ర పట్టలేదు

pm modi
pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీలో విద్యార్థులతో నిర్వహించిన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. చంద్రయాన్‌-2 విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ సాంకేతిక కారణాలతో విఫలమైన తర్వాత… ఆ రాత్రి తనకు నిద్ర పట్టలేదని ప్రధాని మోడి అన్నారు.చంద్రయాన్2 లాంచ్ మిషన్ ను వీక్షించేందుకు వెళ్లవద్దని తనకు పలువురు సూచించారని చెప్పారు. ప్రయోగ ఫలితం ఎలా ఉండబోతోందో తెలియదని, విఫలమైతే ఏంటనేది మరో సందిగ్ధత అని… కానీ, ఇస్రోను సందర్శించాలనే తాను అక్కడకు వెళ్లానని తెలిపారు.

విక్రమ్ ల్యాండర్ ఇస్రో హెడ్ క్వార్టర్ తో సంబంధాలను కోల్పోయిందని శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత తాను హోటల్ కు వెళ్లానని చెప్పారు. ప్రయోగం విఫలం కావడం వల్ల తాను నిరాశ చెందలేదని… కానీ, ప్రశాంతంగా ఉండలేక పోయానని తెలిపారు. వెంటనే ప్రధాని కార్యాలయం అధికారులను పిలిపించి షెడ్యూల్ మార్చమని చెప్పానని… మరుసటి రోజు ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. వారితో సమావేశం సందర్భంగా చంద్రయాన్2 టీమ్ కృషిని అభినందించానని… దీంతో, అందరి బాధ తొలిగిపోయిందని చెప్పారు. అపజయాలను నుంచి విజయాలను ఎలా సాధించాలో నేర్చుకోవచ్చని అన్నారు. రానున్న రోజుల్లో ఘన విజయాన్ని సాధించబోతున్నామని చెప్పారు. చంద్రుడి ఉపరితలాన్ని మనం తాకకపోయినప్పటికీ… ఒక కవి మాటల్లో చెప్పాలంటే… చంద్రుడిని తాకేందుకు చంద్రయాన్2 తాపత్రయ పడిందని, అందుకే దానివైపు అది దూసుకెళ్లిందని చమత్కరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/