కోరలుచాస్తున్న కరోనా

ఆందోళనలో ప్రపంచ మానవాళి

corona cases worldwide
corona cases worldwide

కరోనా వైరస్‌ ఆందోళనకరస్థాయిలో విజృంభిస్తున్నది. ఒకపక్క కేంద్ర, ఆయారాష్ట్ర పాలకులు ముందస్తు జాగ్ర త్తలు తీసుకునేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉన్నది.

అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటూనే ఉంది. ఇంకొక పక్క ప్రజల భయాలను,కరోనా విస్తరణను సొమ్ము చేసు కునేందుకు కొన్ని ప్రైవేట్‌ఆస్పత్రులు అన్ని విన్యాసాలు చేస్తున్నాయి.

అన్నింటికంటే ముఖ్యంగా కరోనా సోకిందా లేదా అనే విషయంలో పరీక్షలు చేసి నిర్ధారించాల్సిన ప్రయోగశాలలే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.

దాంతో అసలు కరోనా సోకిందా లేదా అనే విషయంలో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. సందిగ్ధపరిస్థితి.

ఇంకొన్ని ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించడానికి ఇష్టపడటం లేదు. మరికొన్ని పెద్ద ఆస్పత్రులు ఏకంగా ప్యాకేజీలే ప్రకటిం చాయి.

పదిహేను లక్షల రూపాయలు చెల్లిస్తే కరోనా వ్యాధిగ్రస్తునికి చికిత్స అందిస్తామని తెగేసి చెప్పేస్తు న్నాయి.

అంత డబ్బు చెల్లించుకోలేనివారు కొందరు అయితే బీదాబిక్కసన్నజనం పరిస్థితి దారుణంగా ఉంది. వైద్యసహాయం అందక ఎందరోఇప్పటికే ప్రాణాలు కోల్పో యారు, కోల్పోతున్నారు.

కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు, ఇతర వైద్యసిబ్బందికి కరోనా సోకుతుండటంతో వారి కుటుంబాలు ఆందోళన చెంద డమేకాదు విధులకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది హాజరు తగ్గిపోయింది.

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. అన్నింటికంటే ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది.

స్వచ్ఛందంగా వ్యాపారులు, ఇతర ప్రైవేట్‌ కార్యాలయాల యాజమానులు, పారి శ్రామిక వేత్తలు తమ సంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎవరికి వారు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను ప్రకటించుకుంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లో పరిస్థితి రానురాను ఆందోళనకరంగా తయారవుతున్నది.

కొవిడ్‌ పరీక్షల విషయంలో ఐసిఎమ్‌ఆర్‌ కొన్ని నిర్దిష్టమైన నిబం ధనలను విధించింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికే పరీక్షలు జరపాలని మార్గదర్శకాలు విధించారు.

కానీ ఇవేమీ కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌లు పట్టించుకోవడం లేదు. మరికొన్ని ల్యాబ్‌లు నెగిటివ్‌ వచ్చినా పాజిటివ్‌ వచ్చినట్లు రిపోర్టులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

దీంతో గత నెల 24న ప్రైవేట్‌ ల్యాబ్‌ ఇచ్చిన పరీక్షల నివేదికలపై వచ్చిన అనుమానాలను నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఆరోగ్యశాఖకు చెందిన సీనియర్‌ అధికారులు మైక్రోబయాలజిస్ట్‌తో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయించారు.

పాజిటివ్‌ లేకపోయినా కరోనా ఉన్నట్లుగా ఫలితాలు ఇస్తూ ప్రజ లను తప్పుతోవ పట్టిస్తున్నారని,రక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్ల అక్కడికి వచ్చే ఇతరులకు కరోనా పొంచి ఉన్నదని హెచ్చరించారు.

అందుకే ప్రైవేట్‌ ల్యాబ్‌లు ఇస్తున్న ఫలితాలు సరైనవా? కావా అని తేల్చడానికి మరొకసారి ప్రైవేట్‌ ల్యాబరేటరీలో సమగ్ర తనిఖీలు, పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

జిల్లా మండల కేంద్రాల్లో ఉన్న రోగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్‌లోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుందని ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఒకే రోజు దాదాపు ఇరవైవేల వరకు కేసులు నమోదయ్యాయి.

నాలుగు వందల పదిమంది మరణించగా, పదమూడు వేలకుపైగా మంది కోలుకున్నారు.ఇన్ని కేసులు ఒకే రోజు రావడం ఇదే మొదలు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

కరోనా విస్తరణ నివారణకు యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది.

అన్నింటికంటే ముఖ్యంగా అవసరం మేరకు సిబ్బందిని నియమించి ముఖ్యంగా వెంటిలేటర్లు సమకూర్చాల్సిన సమయమిది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/