భాగ్యనగరంలో ‘కరోనా’
దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
ఢిల్లీలో మరో కేసు నమోదురాజస్థాన్ వ్యక్తికి కొవిడ్ లక్షణాలు!
70 దేశాలకు పాకిన వైరస్
10 రోజుల్లోనే 37 దేశాలకు మహమ్మారి
3వేలు దాటిన మృతులు.. లక్షకు చేరువలో రోగులు
అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ తాజాగా భారత్ దేశంలోనూ తొలిసారిగా వైరస్ పాజిటివ్ కేసులు వెళ్లడయ్యాయి. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఇటు రాZంలో కూడా కరోనాను ఎదుర్కొనేందు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాZ మంత్రి ఈటల వెల్లడించారు.

హైదరాబాద్: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ వైరస్ హైదరాబాద్‌లో కనిపించింది. దుబా§్ు వెళ్లొచ్చిన తెలంగాణ వ్యక్తికి తాజాగా పరీక్షలు నిర్వహించగా కోవిడ్ సోకినట్లు తేలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఇటలీ వెళ్లొచ్చిన ఢిల్లీ వాసికి కూడా కోవి డ్ సోకినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఆసుపత్రిలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. రాజస్తాన్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా కోవిడ్ లక్షణాలు కన్పిస్తున్నప్పటికీ ఇంకా నిర్దారణ కాలేదని ప్రభుత్వం ప్రకటించింది.
అతనికి రెండుసార్లు రక్త పరీక్షలు నిర్వహించగా తొలిసారి పాజిటివ్, రెండోసారి నెగిటివ్ అని రిపోర్టులు వచ్చాయ న్నారు. మూడోసారి కూడా శాంపిల్ సేకరించి ల్యాబ్‌కు పంపామని నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలో కోవిడ్‌పై భారత ప్రభుత్వం రెడ్ అలర్డ్ ప్రటించినట్లు పేర్కొన్నారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని చప్పారు. దేశవ్యాప్తంగా 15 ల్యాబ్‌లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తులంతా కోవిడ్ పరీక్షలు చేయించు కోవాలని కోరారు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న చైనా, హంకాంగ్, ఇరాన్, ఇటలీసహా మొత్తం 12 దేశాల నుండి వచ్చే ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో గత నెలలో కేరళలో తొలిసారి కోవిడ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఆ రాష్ట్రంలో ముగ్గురికి కోవిడ్ వైరస్ సోకడంతో సవాల్‌గా తీసుకున్న కేరళ వైద్య బృందం ప్రత్యేక వార్డులో ఉంచి నిరంతరం చికిత్స అందించారు. ఆ వైద్యుల కృషి ఫలించి ఆ ముగ్గురి పూర్తిగా కోలుకున్నారు. ఆ తరువాత వారికి పలుమార్లు కోవిడ్ వైరస్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్చి చేశారు.
ఒక్క ఉద్యోగికి కోవిడ్…వందలాది మందికి పరీక్షలు
కోవిడ్ తొలి కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులు, గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికీ కోవిడ్ సోకలేదన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తికే కోవిడ్ సోకిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయ న తెలంగాణలో తొలి కోవిడ్ వైరస్ సోకిన వ్యక్తి వివరాలను వెల్లడించారు. ఆయనేమ న్నారంటే.. ీుబెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే తెలంగాణకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరి 17న దుబాయి వెళ్లాడు. నాలుగురోజులపాటు హాంకాంగ్ వ్యక్తులతో కలిసి పనిచేసి బెంగళూరుకు తిరిగొచ్చాడు.
అక్కడి నుండి ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు బస్సులో వచ్చాడు. ఆ బస్సులో 27 మంది ప్రయాణించినట్లు తేలడంతో వారందరికీ పరీక్షలు చేస్తున్నాం. వారితోపాటు వారి వారి కుటుంబ సభ్యులు 80 మంది ఉన్నట్లు గుర్తించాం. వారికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. కోవిడ్ సోకిన వ్యక్తికి తొలుత జ్వరం వచ్చింది. ఇంటి దగ్గర నాలుగు రోజులున్నారు. అయినా తగ్గకపోవడంతో ఫిబ్రవరి 22న అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స చేయించుకున్నారు.
వారం రోజులైనా తగ్గకపోవడంతో అనుమానంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కోవిడ్ అనుమానంతో అతని నుండి శాంపిల్ సేకరించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. మరోసారి నిర్దారించేందుకు ఆ రిపోర్టును, బ్లడ్ శాంపిల్‌ను కేంద్రానికి పంపాం. పూణెలో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ వైరస్ సోకినట్లు నిర్దారణ కావడంతో సోమవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కోవిడ్ బాధితుడిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నాం.

వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడాం. బాధితుడు హైదరాబాద్‌కు వచ్చాక ఎవరెవరిని కలిశాడు? అపోలో ఆసుపత్రిలో ఏయే డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలందించారు? అనే వివరాలను సేకరించాం. వారికి సైతం పరీక్షలు నిర్వహిస్తున్నాుుంఅని వివరించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. కోవిడ్‌ను అడ్డుకునేందుకు అవసమైతే ప్రత్యేక నిధులు వాడుకోవాలని సీఎం సూచించారన్నారు.
ప్రస్తుతం నెలకొన్న వేసవి వాతావరణంలో కోవిడ్ ప్రబలే అవకాశాల్లేవని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. కోవిడ్ సోకిన వ్యక్తి బెంగళూరులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ కోవిడ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కన్పిస్తే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. గాంధీ, ఛాతీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి జన సమ్మర్ధ ప్రాంతాల్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం 8 శాఖల అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో జరిగే ఈ సమావేశంలో పంచాయతీరాజ్, విద్య, సమాచార, రవాణా, హోం, రెవిన్యూ, మున్సిపల్, పర్యాటక శాఖ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి కార్యాచరణను రూపొందించనున్నారు.
అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో కోవిడ్ వ్యాప్తి
ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సోమవారం సాయంత్రానికి మొత్తం 70 దేశాలకు కోవిడ్ వైరస్ పాకింది. 3,200 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఆయా దేశాల్లో బాధితుల సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది. ఒక్క చైనాలోనే బాధితుల సంఖ్య దాదాపు 90 వేలు. మృతుల సంఖ్య 2912. చైనా తరువాత వైరస్ ఉధృతి దక్షిణ కొరియాలో తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 4212 మందికి వైరస్ సోకింది. 22 మంది చనిపోయారు.
అక్కడి ఆసుపత్రులన్నీ కోవిడ్ బాధితులతో నిండిపోయాయి. ఆ తరువాత ఇటలీలో 1694, ఇరాన్లో 1502, జపాన్‌లో 961, ఫ్రాన్స్‌లో 130, సింగపూర్‌లో 106 కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ ఇద్దరు మరణించారు. అగ్రరాజ్యంలోనూ ఇప్పటికే 80 కేసులు నమోదయ్యాయి. ఇరాన్లో కోవిడ్ మృతుల సంఖ్య ఏకంగా 66కు చేరింది. ఇరాన్ సుప్రీం లీడర్ సలహామండలి సభ్యుడు మహమ్మద్ మిర్ మొహమ్మది మరణించారు.
ఈ వైరస్ ప్రభావంతో ఉన్నతస్థాయి వ్యక్తి మరణించడం ఇదే తొలిసారి. కేవలం గత 10 రోజుల్లో ఏకంగా 37 దేశాలకు కోవిడ్ మహమ్మారి విస్తరించింది. దీనినిబట్టి కోవిడ్ తీవ్రత ఎంత ఉధృతంగా ఉందో అర్ధమవుతోంది. ఖండాల వారీగా పరిశీలిస్తే అంటార్కిటికా తప్ప ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లోనూ కోవిడ్ మహమ్మారి విస్తరించింది.
వాటికన్ సిటీ పోప్‌ను తాకిన కోవిడ్
కోవిడ్ వైరస్ వాటికన్ సిటీని తాకింది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జరగాల్సిన ఓ ఆధ్యా త్మిక కార్యక్రమాన్ని పోప్ ఫ్రాన్సిస్ రద్దు చేసుకున్నారు. 83 ఏళ్ల పోప్ జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో చివరి నిమిషంలో ఆ కార్యక్రమంలో పాల్గొనరాదని పోప్ నిర్ణ యం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోప్ లేకుండా ఈ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఇటలీలలో 1100కుపై కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది మరణించారు.
ఈ సమయంలో హఠాత్తుగా పోప్ అనారోగ్యం బారిన పడటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నిర్వహించాల్సిన ముఖ్యమైన సదస్సును రద్దు చేసుకుంది. కోవిడ్ నేపథ్యంలో ఈ సదస్సులో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు విముఖత చూపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటలీలో కోవిడ్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
కోవిడ్ ప్రభావిత ప్రాంతమైన ఇటలీ లాంబార్డే ప్రాంతంలోని యూనివర్శిటీలో 85 మంది భారతీయులున్నారు. వీరంతా ప్రస్తుతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరిలో 25 మంది తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా స్వదేశానికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కొనుక్కుప్పటికీ గత వారం రోజుల నుండి విమానాలు రద్దు అవుతూనే ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేంద్రం త్వరగా జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తీసుకెళ్లాలని వారంతా వేడుకుంటున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ హాకీ టోర్నమెంట్‌ను తాకింది. మలేసియాలో ఏప్రిల్ 11 నుండి 13 వరకు నిర్వహించాల్సిన అజ్లాన్‌షా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్‌ను అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. కోవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 24-అక్టోబర్ 3 మధ్యలో టోర్నీని నిర్వహిస్తామని, ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య, ఆసియా హాకీ సమాఖ్యకు తెలిపినట్లు పేర్కొంది.
60 ఏళ్లు దాటిన వారికి రిస్క్ ఎక్కువే
కోవిడ్ వైరస్ ఉధృతి ఎక్కువవుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 60ఏళ్లు పైబడిన వారికి తొందరగా కోవిడ్సోకే అవకాశం ఉందని వెల్లడించింది. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వైరస్‌ను అడ్డుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ వైరస్ రద్దీ ప్రాంతాల్లో తొందరగా వ్యాప్తి చెందే అవకాశాలున్నందున జన సమ్మర్ధ రద్దీ ప్రాంతాల్లో తిరగరాదని సూచించింది.
ఒకవైపు కోవిడ్, స్వైన్‌ఫ్లూ లక్షణాలతో తెలంగాణలో భయందోళనలో నెలకొన్న తరుణంలో తాజాగా చికెన్‌ఫాక్స్, మీజిల్స్ వ్యాధులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వేసవి సీజన్ ఆరంభంలో ఈ వ్యాధులు అక్కడక్కడా కన్పించడం సాధారణమేనని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే గత రెండు నెలల్లో ఏకంగా 226 మీజిల్స్, 67 చికెన్ ఫాక్స్ కేసులు నమోదవడం గమనార్హం. నగరంలోని ఫీవర్ ఆసు పత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా జనవరిలో చికెన్ ఫాక్స్ 27, మీజిల్స్ 83 నమోదు కాగా ఫిబ్రవరిలో ఆ సంఖ్య రెట్టింపైంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/