కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న నిర్వ‌హిస్తారు : రాహుల్ గాంధీ

Congress working committee will act on caste census in states, says Rahul

న్యూఢిల్లీ :కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సోమ‌వారం సీడ‌బ్ల్యూసీ స‌మావేశం అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామని వెల్ల‌డించారు. కుల గ‌ణ‌న‌కు అనుకూలంగా తాము చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

వ‌ర్కింగ్ క‌మిటీ భేటీలో తాము కుల గ‌ణ‌న‌పై విస్తృతంగా చ‌ర్చించామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ దీనికి మ‌ద్ద‌తిచ్చార‌ని తెలిపారు. మ‌రోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కుల గ‌ణ‌న స‌ర్వేలు నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ప‌లువురు స‌భ్యులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో కుల గ‌ణ‌న‌తో పాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు స‌హా ప‌లు అంశాల‌పై సంప్ర‌దింపులు జ‌రిపారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యానికి అవ‌స‌ర‌మైన వ్యూహాల‌పై చ‌ర్చించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ కుల గ‌ణ‌న‌కు అనుకూలంగా ఉంద‌ని, రాజ‌స్ధాన్‌లో ఈ దిశ‌గా ప్ర‌క్రియ మొద‌లైంద‌ని కాంగ్రెస్ నేత భ‌న్వ‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో రాజ‌స్ధాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల సీఎంల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల సీఎల్పీ నేత‌లు పాల్గొన్నారు.