కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆచూకీ లభ్యం

బీజేపీ దాడితో అదృశ్యమైనట్టుగా ప్రచారం జరుగుతున్న గుజరాత్‌ దంతా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడిని పోలీసులు ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాంతి మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి లాధు పర్ఘీ, అతడి అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని , వారి నుంచి ప్రాణాలు కాపాడుకోడానికి 15 కిలోమీటర్లు పరిగెత్తాల్సి వచ్చిందని మీడియా కు తెలిపారు.

‘‘నా నియోజకవర్గంలోని ఓటర్లను కలవడానికి వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి లాధు పర్ఘీ, మరి కొందరు నేతలు నాపై దాడి చేశాడు.. ఆయుధాలతో వచ్చినవాళ్లు నాపై కత్తులతో ఎగబడ్డారు.. మా వాహనాలు బమోదర నాలుగు లైన్ రహదారిపై వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి మా దారికి అడ్డుగా వచ్చాడు.. ఆ తర్వాత మేము తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాం.. అప్పుడు ఎక్కువ మంది వచ్చి మాపై దాడి చేశారు’’ అని వాపోయాడు.

తాము బమోదర ఫోర్ వే గుండా వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి తాము వెళ్లకుండా రహదారిని బ్లాక్ చేశాడని పేర్కొన్నారు. తాము కార్లలో తిరిగి వెళ్తుంటే తమ కార్లను వెంబడించారని, బీజేపీ దంతా నియోజకవర్గ అభ్యర్థి లడ్డు పర్ఘి, మరో ఇద్దరు కత్తులు, ఆయుధాలతో వచ్చారని అన్నారు. దీంతో తాము తప్పించుకోవాలని చూశామని, 10-15 కిలోమీటర్లు పరుగెత్తి ఓ అడవిలో దాక్కున్నామని తెలిపారు.

కాగా, కరాడీపై బీజేపీ దాడి చేసిందని, దీంతో ఆయన అదృశ్యమయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంతకుముందు ఆరోపించారు. ఇంత జరిగినా ఎన్నికల సంఘం మౌనంగా ఉండడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు.