గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుకకు సల్మాన్ ముఖ్య అతిధి..?

ఈ నెల 28 న అనంతపురంలో గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా సల్మాన్ ఖాన్ హాజరుకాబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే , ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 28న అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు.

ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారట. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ను చిరంజీవి వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు సమాచారం. అందుకు సల్మాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపించడంతో పాటు చిన్న పాత్రలో సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ లో భాయ్-చిరు ఎలా కనిపించనున్నారు అన్నది రివీల్ చేసారు. ఈనేపథ్యంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది.