కేసీఆర్ భద్రాచలం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఎం నేతల హౌస్అరెస్ట్
సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటన నిమిత్తం కాంగ్రెస్, సీపీఎం నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. కేసీఆర్ పర్యటనకు ఎలాంటి అంటకాలు సృష్టించకుండా ఉండేందుకు కాంగ్రెస్, వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు. భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న విపత్తు, గోదావరి వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు కేసీఆర్ భద్రాచలంకు కొద్దీ సేపటి క్రితం చేరుకున్నారు.
ఉదయం హన్మకొండ నుండి రోడ్డు మార్గాన భద్రాచలం కు చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే చేయాలనీ అనుకున్నప్పటికీ , వాతావరణం అనుకూలించకపోవడం తో రోడ్డు మార్గాన బయలుదేరారు. హన్మకొండ నుండి ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. రోడ్డు మార్గాన గోదావరి ఉదృతిని పరిశీలిస్తూ వచ్చారు. భద్రాచలంకు చేరుకోగానే ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి శాంతి పూజ నిర్వహించారు. వంతెన పైనుంచి గోదావరి పరిసరాలను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మరికాసేపట్లో గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుని వారికి భరోసానిస్తారు. ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.