ప్రశాంతంగా కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. వైసీపీ, బీజేపీ సహా మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు 1339 మంది పోలింగ్ సిబ్బంది, 1032 మంది పోలీస్, ఏ.ఆర్.పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌ రెండు కంపెనీలు, సీఐఎస్‌ఎఫ్‌ ఒక కంపెనీ.. బలగాలు ఉపఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు నియోజకర్గంలో మొత్తం 2,13,138 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,07,367 మంది మహిళలు, 1,05,960 మంది పురుష ఓటర్లు ఉన్నారు.

ఉదయం 6 గంటల నుంచేబారులు తీరారు ఓటర్లు. మహిళలు ,వృద్దులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్‌ పోలింగ్ నడుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. గత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం జగన్‌ మంత్రివర్గంలో ఐటీ, పరిశ్రమల మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్నది.