భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర

సిలిండర్‌ ధరపై రూ.105 పెంపు

న్యూఢిల్లీ: దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధ‌ర పెరిగింది. నేటి నుంచి ఆ సిలిండర్‌ ధరపై రూ.105 పెంచుతున్న‌ట్లు చ‌మురు సంస్థ‌లు వెల్ల‌డించాయి. పెరిగిన ధ‌ర‌ల‌తో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీ, కోల్‌క‌తా, ముంబైలలో రూ.2,000 దాటింది. అలాగే, ఐదు కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను కూడా రూ.27 పెంచామ‌ని చ‌మురు సంస్థ‌లు తెలిపాయి.

ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,012, కోల్‌కతాలో రూ.2,089, ముంబైలో రూ.1962, చెన్నైలో రూ.2,185.5కి పెరిగింది. అలాగే, ఐదు కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.569కి పెర‌గ‌డం గ‌మ‌నార్హం. కాగా, గ‌త నెల 1న‌ వాణిజ్య సిలిండర్‌పై రూ.91.50 తగ్గించారు. ఇప్పుడు రూ.105 పెంచి మ‌ళ్లీ భారం మోపారు.

వాణిజ్య సిలిండర్ ధ‌రను పెంచిన చమురు సంస్థ‌లు గృహ అవసరాల సిలిండర్ల ధరలను మాత్రం పెంచ‌క‌పోవ‌డం ఊర‌ట క‌లిగించే విష‌యం. ఇప్ప‌టివ‌ర‌కు 14.2 కిలోల సిలిండర్ ధ‌ర ఢిల్లీ, ముంబైలో రూ.899.5గా ఉండ‌గా, కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.915.5, హైదరాబాద్‌లో రూ.952 గా ఉంది. ఆ ధ‌ర‌లు అలాగే కొన‌సాగుతాయని చ‌మురు సంస్థ‌లు ప్ర‌క‌టించాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/