మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా స్వయంగా చూసి తేల్చేద్దాంః సిఎం రేవంత్‌ రెడ్డి

cm-revanth-reddy-invites-kcr-to-medigadda-tour

హైదరాబాద్‌ః ప్రపంచంలోనే అద్భుతమంటూ బిఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కెసిఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు మాజీ సీఎం కెసిఆర్, కాళేశ్వర రావు (హరీశ్ రావును ఉద్దేశించి) లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలని కోరారు. కెసిఆర్ కోసం ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ఓ హెలికాఫ్టర్ ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని చెప్పారు. ఈమేరకు మంగళవారం ఉదయం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

మాజీ సీఎం కెసిఆర్ ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనుగొన్నారని, దాంతో ప్రాజెక్టు అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కి పగుళ్లు ఏర్పడిందని ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారని గుర్తుచేశారు. భారీగా పోలీసులను మోహరించి బ్యారేజ్ పైకి ఎవరూ పోకుండా అడ్డుకున్నారని, మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ ను గత ప్రభుత్వం దాచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి లేస్తాయని, భూమిలోకి కుంగదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయం ‘అ ఆ’ లు చదివే పిల్లవాడికీ తెలుసని అన్నారు.

మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చేశారా..? లేక బ్యారేజీనే ఇసుకలో పేకమేడలా కట్టారా? అనేది అక్కడికి వెళ్లి చూసి తేల్చదానికే ప్రభుత్వం ఈ టూర్ ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు రావాలని సీఎం ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి చూసి వచ్చాక ఒకటి రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో అందరమూ చర్చిద్దామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి ఏటీఎంగా మారింది.. దాని కథ, కమామీషు అంతా తేల్చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.