పెట్టుబడులు పెట్టే ఫార్మా కంపెనీలకు సహకరిస్తాంః సీఎం రేవంత్ రెడ్డి హామీ

CM Revanth Reddy assured that we will cooperate with the pharma companies that invest

హైదరాబాద్ః వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి కనబరిచారు. తెలంగాణలో మెడికల్ రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వారికి తెలిపారు. హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్‌లలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ స్కిల్ క్యాపిటల్‌గా మారబోతుందని తెలిపారు. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఫార్మా కంపెనీలకు సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా-2024 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ ఐటీ, సాఫ్టువేర్ రంగాల్లో అగ్రగామిగా ఉందని, కరోనా అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారన్నారు.

హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రాజధాని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలో మూడు కొవిడ్ వ్యాక్సీన్లు రాగా అందులో ఒకదానిని అందించిన ఘనత హైదరాబాద్‌దే అన్నారు. పరిశోధనలకు నిలయంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. తమ ప్రభుత్వం స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఫార్మా రంగానికి తాము అండగా నిలబడతామన్నారు.