కాళేశ్వరం బయల్దేరిన సిఎం కెసిఆర్‌

యాసంగి సీజన్‌లో పంటలకు జలాలను పంపింగ్‌చేస్తున్న నేపథ్యంలో పర్యటన

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం పర్యటనకు బయల్దేరారు. యాసంగి సీజన్‌లో పంటలకు జలాలను పంపింగ్‌చేస్తున్న నేపథ్యంలో సిఎం కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న జలాలు ఎన్ని? ఎగువ నుంచి ఎంత నీరు వస్తున్నది? రోజుకు ఎన్ని టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయవచ్చు? వేసవికాలంలో కూడా రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. లక్ష్మీ బరాజ్‌ను సందర్శించి పరిస్థితిని అంచనావేస్తారు.

ముందుగా కాళేశ్వర, ముక్తీశ్వర దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్‌ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. బరాజ్‌ వద్ద భోజనం చేసిన అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగివస్తారు. సిఎం కెసిఆర్‌ వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు ప‌లువురు ఉన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/