నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్లకు చేరుకోనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని మంత్రి జగదీష్ రెడ్డి సహా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం అక్కడే సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి ప్రగతిభవన్ చేరుకుంటారు. సీఎం రాక నేపథ్యంలో వీర్లపాలెంలో జిల్లా అధికారులు హెలిపాడ్ ను సిద్ధం చేశారు. మరోవైపు, దేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని భావించిన ప్రభుత్వం…. దీని నిర్మాణం కోసం నేషనల్ హైవే, రైల్వే, నీటి సౌకర్యం ఉన్న వీర్లపాలెం గ్రామాన్ని ఎంపిక చేసింది.

ఈ ప్లాంట్ ను రూ. 29,992 కోట్లతో నిర్మిస్తున్నారు. ఐదు ప్లాంట్ల ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ కోసం 4,676 ఎకరాల భూమిని సేకరించి జెన్ కోకు అప్పగించారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఐదు ప్లాంట్లలో రెండు ప్లాంట్లలో 2023 నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ నాటికి మరో ప్లాంటును.. 2024లో మిగిలిన రెండు ప్లాంట్లను పూర్తి చేసి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభించాలని జెన్ కో నిర్ణయించింది.

గడిచిన ఎనిమిదిన్నరేండ్లుగా విద్యుత్తు రంగంలో అనేక రికార్డులు నెలకొల్పిన తెలంగాణ.. దేశంలో ఎవరికీ సాధ్యపడని విధంగా వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ పూర్తి ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. అలాగే మన దగ్గరి మిగులు విద్యుత్తును అందించేందుకు, అవసరమైనప్పుడు తీసుకునేందుకు వీలుగా రాజస్థాన్‌ విద్యుత్తు సంస్థలతో తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసుకున్న ఒప్పందం చాలా కీలకమైనది. భౌగోళికంగా తెలంగాణతో పోల్చితే.. రాజస్థాన్‌లో పంటకాలం ఒక నెల నుంచి ఒకటిన్నర నెలల తేడా ఉంటుంది. ఇదే అంశాన్ని ఆలోచించిన సీఎం.. రాజస్థాన్‌తో ఒప్పందం చేసుకునేలా సూచించారు. రాజస్థాన్‌కు అవసరం ఉన్నప్పుడు మనం విద్యుత్తును ఇస్తుంటాం. అలాగే మన వానకాలం సాగుకు మొదట్లో కావాల్సిన విద్యుత్తును రాజస్థాన్‌ నుంచి తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల కీలకమైన పంటల సమయంలో విద్యుత్తును అందుబాటులోకి తీసుకొచ్చేలా వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.