రాహుల్ పాదయాత్రలో తొక్కిసలాట..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ జోడో యాత్ర కొనసాగుతోంది. మొదటి నుండి కూడా రాహుల్ ఎక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాదయాత్రలో భాగం అవుతున్నారు. ఈ క్రమంలో ఇండోర్ లో యాత్ర సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భారీగా వచ్చిన జనాలను పోలీసులు నియంత్రించలేకపోయారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కిందపడిపోయారు.

ఈ ఘటనలో ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. ఆయనతో పాటు పలువురు గాయపడ్డారు. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీపై కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి బీజేపీ ఓర్చుకోలేకపోతోందని…. తమ యాత్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గత కొన్నేళ్లుగా రాహుల్ పరువు తీసేందుకు బీజేపీ ఎంతో ప్రయత్నించిందని అన్నారు. యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న బీజేపీ వైఫల్యాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.