నేడు మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేటలో సిఎం కెసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు

cm kcr

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కెసిఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా నియోజకవర్గాలతోపాటు మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌, సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మం జిల్లాలోని మధిరలో ఆత్కూరు క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. లింగాల కమల్‌రాజు విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. అనంతరం వైరాకు చేరుకుంటారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌ తరపున ప్రచారం చేస్తారు. దీంతో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో సిఎం కెసిఆర్‌ సభలు పూర్తయినట్లవుతుంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు మహబూబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌ నియోజకవర్గానికి చేరుకుంటారు. మరిపెడ బంగ్లాలోని వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. సభ అనంతరం సూర్యపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం హాజరవుతారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డికి మద్దతుగా ప్రసంగించనున్నారు. ఈ సభతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రచారం ముగియనుంది.