నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా క‌విత ఏక‌గ్రీవం

నిజామాబాద్ : ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి శ్రీనివాస్ నామినేష‌న్‌ను ఎన్నిక‌ల అధికారులు తిర‌స్క‌రించారు. శ్రీనివాస్ అఫిడ‌విట్‌లో త‌ప్పులు ఉన్నాయ‌ని, ఈ క్ర‌మంలోనే నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. క‌విత ఏక‌గ్రీవంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

ఉమ్మడి నిజా‌మా‌బాద్‌ జిల్లా నుంచి కల్వ‌కుంట్ల కవిత మరో‌సారి బరి‌లోకి దిగిన విష‌యం తెలిసిందే. ఏడాది క్రితం ఇదే నియో‌జ‌క‌వర్గం నుంచి ఎమ్మె‌ల్సీగా అఖండ విజయం సాధిం‌చిన కవిత మరో‌సారి తిరిగి పోటీ చేశారు. కవిత తర‌ఫున నాలుగు సెట్ల నామి‌నే‌షన్ల‌ను దాఖ‌లు చేశారు. గత ఉప ఎన్ని‌కల అను‌భ‌వాన్ని దృష్టిలో పెట్టు‌కొని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని‌క‌లకు దూరంగా ఉండి‌పో‌యాయి. అభ్య‌ర్థుల కోసం ఇరు పార్టీలు వెదికిన‌ప్ప‌టికీ చివరి వరకు ఏ ఒక్కరూ పోటీ చేసేం‌దుకు ముందుకు రాక‌పో‌వ‌డంతో జాతీయ పార్టీలు చేతు‌లె‌త్తే‌శాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి శ్రీనివాస్ నామినేష‌న్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టికీ అది తిరస్క‌ర‌ణ‌కు గురైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/