ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు త్వరలో కొత్త డిజిటల్‌ కార్డులు

cm-kcr-govt-to-distribute-new-aarogyasri-card-soon-with-rs-5-lakhs-limit

హైదరాబాద్‌ః ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం త్వరలో అందించనున్న ఆరోగ్య శ్రీ కార్డు ముందుభాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, లింగం, కార్డు నంబర్‌ వంటి ప్రాథమిక వివరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ లోగో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ లోగో, సిఎం కెసిఆర్‌ ఫొటో ముద్రించనున్నారు. స్కాన్‌ చేస్తే సమగ్ర వివరాలు తెలిసేలా క్యూఆర్‌ కోడ్‌ను కూడా కార్డ్‌పై ముద్రిస్తారు. వెనకభాగంలో ఆరోగ్యశ్రీ ఉపయోగాలు ఉంటాయి.