అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సిఎం

14 అత్యవసర వాహనాలు, 36 పోలీసు వాహనాలు ప్రారంభం

cm-jagan-inaugurates-emergency-vehicles

అమరావతి: ఏపి సిఎం రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. 14 ప్రత్యేక వాహనాలతో పాటు, అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలకు సిఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా.. 20 మంది ఎస్డీఆర్‌ఎఫ్‌ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ వర్చువల్ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

కాగా, ఇవాళ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సిఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, బియ్యం కార్డులకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులు లేకుండా చూడాలని చెప్పారు. నిర్దిష్ట గడువులోపల ఆయా పథకాలు లబ్దిదారులకు అందిస్తామని హామీ ఇచ్చిన మేరకు కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక, అమ్మఒడి పథకానికి అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధులై ఉండాలని సిఎం జగన్ స్పష్టం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/