సీఎం జగన్ భీమిలి టూర్..టిడిపి, జనసేన నేతల అరెస్టు

ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటారనే ఉద్దేశంతో గృహనిర్భందం

CM Jagan Bheemili tour..TDP and Janasena leader arrested

అమరావతిః సిఎం జగన్ భీమిలి పర్యటన సందర్భంగా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం సభకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. టిడిపి, జనసేన పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలను గృహనిర్భందం చేశారు. ఆయా లీడర్ల నివాసం వద్ద కాపలా ఏర్పాటు చేశారు. వారిని ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరికొంతమంది నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

భీమిలిలో సిద్ధం పేరిట ముఖ్యమంత్రి సభ కోసం వైఎస్‌ఆర్‌సిపి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ సభను అడ్డుకుంటారనే అనుమానంతో ప్రతిపక్ష నేతలను పోలీసులు ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. జనసేన పార్టీ భీమిలి ఇన్ చార్జి పంచకర్ల సందీప్‌ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ టూర్ నేపథ్యంలో తనను హౌస్ అరెస్ట్ చేశారని జనసేన లీడర్, విశాఖపట్నం కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ తెలిపారు. విశాఖ భూదోపిడీలపై అధికార పార్టీ పెద్దలను నిలదీసినందుకే తనను అడ్డుకున్నారని యాదవ్ ఆరోపించారు. సీఎం పర్యటిస్తున్నారని ప్రతిపక్షాలను అడ్డుకోవడం, పోలీస్ వలయాలు ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.