శాసన సభలో తన బలాన్ని నిరూపించుకోనున్న సిఎం హేమంత్ సోరెన్

CM Hemant Soren to seek trust vote amid disqualification buzz

ఝార్ఖండ్ః ఎమ్మెల్యేగా అనర్హత వేటు ఎదుర్కొనే అవకాశం ఉన్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షకు హాజరయ్యారు. శాసన సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు ఈ రోజు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ‘విశ్వాస తీర్మానం’ ప్రవేశ పెట్టారు. క్యాంప్ నుంచి తన ఎమ్మెల్యేలతో కలిసి సోరెన్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. ‘మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. రేషన్, దుస్తులు, కూరగాయలు కొనేవారి గురించి మనం విన్నాం. కానీ బిజెపి కారణంగా ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వింటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలను వేటాడేందుకు ప్రతిపక్ష బిజెపి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకే విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యామని ఆయన చెప్పారు. ‘ప్రతిపక్షం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది. శాసనసభ్యులపై బిజెపి గుర్రపు పందెం మాదిరి వ్యాపారం చేస్తోంది. సభలో మా సత్తా చూపుతాం’ అని సోరెన్ పేర్కొన్నారు.

కాగా, గత వారం ఢిల్లీ అసెంబ్లీలో చూసిన సంఘటనను ఈ రోజు రాంచీలో పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా సోరెన్ కూడా ఈ పరీక్షలో గెలుస్తారని భావిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టి, ఆ పార్టీ వ్యూహాలను బయట పెట్టాలని సోరెన్ భావిస్తున్నారు. ఢిల్లీ మాదిరిగా ఝార్ఖండ్ లో అధికారంలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్ఛా (జేఎంఎం) నేతృత్వంలోని యూపీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అందువల్ల విశ్వాస తీర్మానం కేవలం తమ ఐక్యతను చాటేందుకు పనికొస్తుందని జేఎంఎం భావిస్తోంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లంచం ఆరోపణలపై సస్పెండ్ చేయడానికి ముందు కూటమికి 82 మంది సభ్యుల అసెంబ్లీలో 52 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు 49 మంది ఎమ్మెల్యేలు జేఎంఎంలో ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/