గురుపూజోత్సవం సందర్బంగా ఏపీసర్కార్‌కు చంద్రబాబు, లోకేష్ సూచనలు

నేడు గురుపూజోత్సవం సందర్భంగా గురువులపై గౌరవంగా వ్యవహరించాలి అంటూ ఏపీసర్కార్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. విద్యాశాఖలో సంస్కరణల పేరుతో తెచ్చిన సంక్షోభానికి ప్రభుత్వం తెరదించాలని అని చంద్రబాబు అన్నారు. విద్యావ్యవస్థపై బాధ్యతగా, విద్యను అందించే గురువులపై ప్రభుత్వం గౌరవంగా వ్యవహరించాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనులతో ఒత్తిడి తెచ్చి విద్యా ప్రమాణాలను నాశనం చేస్తున్నారని, ప్రశ్నించే వారిని అణగదొక్కేస్తుందని ఆరోపించారు. సకాలంలో జీతాలు చెల్లించక అగౌరవ పరుస్తుందని అన్నారు. సమస్యలను ప్రస్తావిస్తే వేధింపులకు గురిచేస్తారా ? సీపీఎస్‌ రద్దు, పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వాన్ని అడగకూడదాని ప్రశ్నించారు .

పాఠశాలల విలీనం పేరిట విద్యను బాలబాలికలకు దూరం చేస్తుంటే మాట్లాడకూడదా అని నిలదీశారు. పిల్ల లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులను దైవంగా భావించే సమాజం మనదని గుర్తు చేశారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ట్విట్టర్ ద్వారా గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ సర్కార్ ఫై పలు విమర్శలు చేశారు. గురువును మించిన దైవం లేదు. విద్యాబుద్ధులు నేర్పి సమాజ ఉన్నతికి నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం శుభాకాంక్షలు తెలియజేసారు. అమ్మకి అన్నం పెట్టని వాడు..గురువుకి దండం పెట్టనివాడు సీఎంగా ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి పాలనలో గౌరవం మాట దేవుడెరుగు కానీ..ఉపాధ్యాయులకు అవమానాలు అన్నీ ఇన్నీ కావని ట్విట్టర్ వేదికగా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.