నిస్వార్ధ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి అవసరం: జస్టిస్‌ ఎన్వీ రమణ

అనంతపురం: అనంతపురంలోని పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 24 మందికి డాక్టరేట్లు, 465 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ..పతకాలు అందుకున్న విద్యార్థులను అభినందిచారు. విద్యార్థులు కీలక దశ ముగించుకుని తర్వాతి దశకు వెళ్తున్నారని చెప్పారు. నిస్వార్ధ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. నేర్చుకున్న విద్యా విలువలను ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు. విద్యార్థులు ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

విలువలతో విద్య అందించే దిశగా వర్సిటీలు ఉండాలన్నారు. విలువలతో కూడిన నైపుణ్యాలతో ప్రపంచాన్నే మార్చే శక్తి సమకూరుతుందని వెల్లడించారు. మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని తెలిపారు. విద్యార్థులపై సత్యసాయిబాబా వాత్సల్యానికి వర్సిటీ ప్రతీక అని, ఆధునిక గురుకులాలకు ఆదర్శ నమూనా అన్నారు. సత్యసాయి మాతృప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారని, ఎక్కడికి వెళ్లినా మాతృభాషకు ప్రాధాన్యమిచ్చేవారని చెప్పారు. నేటికీ వర్తించే ఎన్నో అంశాలు రామాయణం, మహాభారతంలో ఉన్నాయన్నారు. పెద్దలను గౌరవిస్తున్నారా అనేది పాలకులు గుర్తుంచుకోవాలని, ప్రజలను బాగా చూసుకుంటున్నారో లేదో ఆలోచించాలని సూచించారు. బలహీనుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారా అనేది ఆలోచించాలన్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే 14 అవలక్షణాలు వస్తాయని, వాటిని సరిచేసుకుని మంచి పాలన అందించాలని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/