ఇంటర్‌ నుంచే సివిల్స్‌ ప్రిపరేషన్‌

ఇంజినీరింగ్‌ లక్ష్యంగా విద్యార్థులు అడుగులు

inter plus studies

ఇంటర్‌ ప్లస్‌ జెఇఇ కోచింగ్‌ ఇప్పటివరకు మనందరికీ తెలిసిన విషయమే. ఇంజినీరింగ్‌ లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇంటర్‌లో చేరిన మరుక్షణం నుంచే ఇంటర్‌ ప్లస్‌ జెఇఇ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ట్రెండే అత్యున్నతమైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల విషయంలోనూ కనిపిస్తోంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసేందుకు కనీస అర్హత డిగ్రీ.

కాని ఇంటర్‌లో చేరగానే సివిల్స్‌ ప్రిపరేషన్‌ దిశగా కసరత్తు ప్రారంభిస్తున్నారు.

అందుకోసం ఇంటర్‌ ప్లస్‌ ఇంటిగ్రేటెడ్‌ ఐఎఎస్‌/ సివిల్స్‌ కోచింగ్‌ వైపు అడుగులు వేస్తున్నారు.

ఇంటర్‌ ప్లస్‌ ఇంటిగ్రేటెడ్‌ సివిల్స్‌ కోచింగ్‌ విధానంలో ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు ముందుగా ఇంటర్మీడియెట్‌, దానికి కొనసాగింపు బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి

. దీనికి సమాంతరంగా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా శిక్షణనిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇంటర్మీడియెట్‌ ప్లస్‌ ఇంటిగ్రేటెడ్‌ సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌గా పొందుతోంది.

ఇంటర్‌తోనే సివిల్స్‌ ప్రిపరేషన్‌ విధానం దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, చెన్నైలలో ఈ ధోరణి పెరుగుతోంది. కానీ ఉత్తరాదిలో బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాతే సివిల్స్‌ దిశగా అడుగులు వేస్తున్నారు.

బలమైన పునాది ఒకే..కానీ:

ఇంటర్మీడియెట్‌ ప్లస్‌ ఇంటిగ్రేటెడ్‌ సివిల్స్‌ ప్రిపరేషన్‌విధానం వల్ల సివిల్స్‌ పరీక్షల్లో విజయానికి అవసరమైన పునాది పడుతుంది. ఫలితంగా సివిల్స్‌ పరీక్షల్లో చిన్న వయసులోనే విజయంసాధించే అవకాశాలు మెరగవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది కొంతవరకు వాస్తవమే అయినప్పటికి సివిల్‌ సర్వీస్‌ పరీక్షల విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రతి రెండు, మూడేళ్లకి ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. దాంతో ఇంటిగ్రేటెడ్‌ విధానంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ఎంపిక విధానంలో మధ్యలో మార్పులు జరిగితే మళ్లీ మొదటికి రాయాల్సి వస్తుంది.

ఇంటిగ్రేటెడ్‌ సివిల్స్‌, ప్రిపరేషన్‌ విధానంలో అధికశాతం తరగతి బోధనకే ప్రాధాన్యం ఉంటోంది.

దీంతో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో విజయానికి అవసరమైన పరిశీలన, విశ్లేషణ సామర్థ్యం, స్వీయ అవగాహన వంటి విషయాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థి నెలకొంది. ముఖ్యంగా సివిల్స్‌ పరీక్షల్లో విజయానికి సమకాలీన పరిణామాలపై అవగాహన, పరిసరాల పరిశీలన చాలా అవసరం.

అంతర్జాతీయంగా, జాతీయంగా, స్థానికంగా జరిగే పరిణామాలను నిరంతరం తెలుసుకోవాల్సి ఉంటుంది. అధిక సమయం తరగతి బోధనకే కేటాయించాల్సిన పరిస్థితుల్లో తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అవగహన పెంచుకోవడం కష్టంగా మారే ఆస్కారముంది.

ఫలితంగా చివరకు అది సివిల్స్‌ పరీక్షల్లో విజయంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వాదన వినిపిస్తోంది.

ఆప్షనల్స్‌పరంగా..:

ఇంటర్‌ నుంచి సివిల్స్‌ విధానంలో ఆప్షనల్‌లో మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. ఇంటర్‌లో హెచ్‌ఇసి, బిఎలో పబ్లిక అడ్మినిస్ట్రేషన్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, జాగ్రఫీ వంటి సబ్జెక్ట్‌లు చదివిన అభ్యర్థులు మెయిల్‌లో ఈ ఆప్షనల్స్‌లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.

వీరికి బ్యాచిలర్‌ స్థాయి నుంచే ఆయా సబ్జెక్టులపై పూర్తిస్థాయి పట్టు లభిస్తుంది. మరోవైపు సివిల్స్‌, మెయిన్‌కు ఉపయోగపడేలా శిక్షణ ఇస్తుండటం కూడా కలిసొస్తుంది. తద్వారా ఆప్షనల్‌ పేపర్లలో మంచి మార్కులు సాధించే అవకాశముంది.

లక్ష్యంపై స్పష్టత ఉంటేనే:

ఇంటర్‌ ప్లస్‌ ఇంటిగ్రేటెడ్‌ సివిల్స్‌ ప్రిపరేషన్‌ విధానంలో విద్యార్థులకు తమ భవిష్యత్తు లక్ష్యంపై స్పష్టత ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే తర్వాతకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు.

ఈ విధానంలో అధికశాతం ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో హెచ్‌ఇసి, సిఇసి వంటి గ్రూప్‌లనే అందిస్తున్నాయి. ఆ తర్వాత కొనసాగింపుగా బ్యాచిలర్‌ డిగ్రీస్థాయిలో బిఎ కోర్సులను మాత్రమే బోధిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నిర్దిష్టలక్ష్యం లేకుండా ఇంటిగ్రేటెడ్‌ విధానంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో సివిల్స్‌ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైతే వారికి కెరీర్‌పరంగా చాలా పరిమితమైన ప్రత్యామ్నాయాలు ఉంటాయనేది నిపుణుల అభిప్రాయం.

ప్రస్తుతం అధికశాతం మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఇతరుల సలహాతోనే సివిల్స్‌ ప్రిపరేషన్‌ దిశగా అడుగులు వేస్తున్నారు.

అంటే 16,17 ఏళ్ల వయసులోనే నిర్ణయం జరిగిపోతుంది. ఈ వయసులో విద్యార్థులకు తమ కెరీర్‌ లక్ష్యాల గురించి, తమ శక్తిసామర్థ్యాల గురించి సరైన అవగాహన ఉండదు. దాంతో వారు సరైన నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సబ్జెక్ట్‌ల విషయంలోనూ సొంతంగా ఆలోచించే పరిణిత కూడా తక్కువే. మరోవైపు ఇంటిగ్రేటెడ్‌ ప్రిపరేషన్‌లో విద్యార్థులు ఎక్కువ సమయం తరగతి బోధనకే పరిమితమవుతున్నారు. ఫలితంగా సమకాలీన అంశాలను ఎలా అవగాహన చేసుకోవాలి..

పరీక్షల్లో, భవిష్యత్‌లో అన్వయించుకోవడం..వాటి ప్రభావం ఏంటి? తదితర అంశాలపై సొంత ఆలోచన ఉండటంలేదు.

అంతేకాకుండా ఇంటర్‌ ప్లస్‌ ఇంటిగ్రేటెడ్‌ సివిల్స్‌ విధానంతో సివిల్స్‌ పరీక్షల్లో విజయం సాధిస్తున్న వారు ఎంతమంది? అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. డిగ్రీ అర్హతతోనే విజయం సాధించి సర్వీసులకు ఎంపికైన వారి సంఖ్య అయిదు నుంచి ఆరుశాతం మధ్యలోనే ఉంటోంది.

డిగ్రీ తర్వాత సివిల్స్‌ కసరత్తు: ప్రస్తుతం సివిల్స్‌ పరీక్షలు రాస్తున్న వారిలో 70శాతం మంది బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాతే సివిల్స్‌ కసరత్తు ప్రారంభిస్తున్నారు. డిగ్రీ తర్వాత అడుగులు వేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయనే అభిప్రాయం ఎక్కువమంది అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

విజేతల్లో అధికశాతం మంది బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత రెండు, లేదా మూడో ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు.

పిజి తర్వాతే సివిల్స్‌వైపు చూస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. దీనికి కారణం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సివిల్స్‌ కసరత్తు ప్రారంభించి సమాంతరంగా పిజి కూడా చదువుతున్నారు.

పిజిలో సివిల్స్‌కు ఉపయోగపడే సబ్జెక్టుకు ఎంచుకుంటున్నారు. పిజిస్థాయిలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్‌, లిటరేచర్‌ సబ్జెక్ట్‌లను స్పెషలైజేషన్‌గా చదువుతున్నారు.

దాంతో వీరికి ఓ వైపు సబ్జెక్టు నైపుణ్యం మరోవైపు మానసిక పరిణితి రెండూ లభిస్తున్నాయి. ఇవి సివిల్స్‌లో విజయానికి దోహదం చేస్తున్నాయి.

సమస్యలపై అవగాహన:

సివిల్స్‌ పరీక్షలో అభ్యర్థులకు సామాజిక సమస్యలపై ఉన్న అవగాహన, ఆయా సమస్యలపై స్పందించే తీరును పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు.

కాబట్టి సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవడం పరీక్షల్లో విజయానికి ఎంతో కీలకంగా మారుతోంది.

దీన్ని గుర్తించే చాలామంది అభ్యర్థులు డిగ్రీ, పిజి తర్వాత ఈ దిశగా కసరత్తు ప్రారంభిస్తున్నారు.
ఇంటర్‌తోనే ఇంటిగ్రేటెడ్‌ సివిల్స్‌ శిక్షణతో సమస్యలపై అవగాహన, స్వీయ విశ్లేషణ వంటి నైపుణ్యాలు లభించే అవకాశం తక్కువనే అభిప్రాయం వినిపిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/