దీనిపై ప్ర‌తీకారం తీర్చుకుంటాము.. చైనా వార్నింగ్‌

బీజింగ్: చైనాలోని బీజింగ్‌లో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న వింట‌ర్ ఒలింపిక్స్‌ను అమెరికా బాయ్‌కాట్ చేసింది. దీనిపై డ్రాగ‌న్ దేశం చైనా రియాక్ట్ అయ్యింది. అమెరికా చేప‌ట్టిన దౌత్య‌ప‌ర‌మైన బ‌హిష్క‌ర‌ణ‌ను చైనా ఖండించింది. దీనిపై ప్ర‌తీకారం తీర్చుకోనున్న‌ట్లు కూడా చైనా హెచ్చ‌రించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జావో లిజియాన్ ఈ అంశం గురించి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తాము కూడా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని, కానీ వాటికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించ‌బోమ‌న్నారు. చైనాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై దౌత్య‌వేత్త‌ల‌ను ఆ దేశానికి పంపేందుకు అమెరికా నిరాక‌రించింది.

కానీ త‌మ దేశ అథ్లెట్లు వెళ్లేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అమెరికా చెప్పింది. అయితే క్రీడ‌ల్లో రాజ‌కీయానికి అమెరికా తెరలేపుతోంద‌ని చైనా మంత్రి జావో ఆరోపించారు. అబ‌ద్ధాలు, అస‌త్యాల ఆధారంగా త‌మ‌ల్ని అమెరికా బాయ్‌కాట్ చేస్తోంద‌ని చైనా ఆరోపిస్తోంది. ఇటీవ‌ల రెండు అగ్ర దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. చైనాలో ఉలిగ‌ర్ ముస్లింల‌పై ఊచ‌కోత‌కు చైనా పాల్ప‌డుతున్న‌ట్లు అమెరికా ఆరోపిస్తోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/