మిత్రమా ‘ఐ మిస్ యు’ అంటూ చిరంజీవి ఎమోషనల్ ..

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల మృతి పట్ల ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కిమ్స్ హాస్పటల్ కు వెళ్లి సిరివెన్నెల ఆఖరి చూపు చూసి నివాళ్లు అర్పించారు. అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరు రోజుల క్రితం ఆసుపత్రిలో జాయిన్ కావడానికి వెళ్తున్న సమయంలో ఆయనతో మాట్లాడానని.. తన ఆరోగ్యం బాగాలేదని.. ఇద్దరం కలిసి మద్రాసు వెళ్లి అక్కడ జాయిన్ అవ్వమని చెప్పాను.. మిత్రమా.. ఈరోజు ఇక్కడ జాయిన్ అవుతాను.. నెలాఖరులోపు వచ్చేస్తాను.. నువ్వు అన్నట్టుగానే అప్పటికీ ఉపశమనం రాకపోతే.. మనిద్దరం కలిసి వెళ్దాం అన్నారని చిరంజీవి తెలిపారు.

అలా వెళ్లిన మనిషి.. ఇలా జీవం లేకుండా వస్తారని ఊహించలేకపోయానని.. ఆసుపత్రిలో చేరిన రోజే ఫోన్ చేస్తే ఉత్సాహంగా మాట్లాడారు.. తిరిగి వస్తారనుకున్నా.. ఎప్పుడూ కలిసిన అప్యాయంగా మిత్రమా అంటూ పలకరిస్తూ మాట్లాడతారని.. తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. వేటూరి గారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలు ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల అని తెలిపారు. సిరివెన్నెల లాంటి వ్యక్తిని కోల్పోతే గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని.. సాహిత్య లోకానికి అన్యాయం చేసి వెళ్లిపోయారని తెలిపారు. భౌతికంగా సిరివెన్నెల దూరమైన.. ఆయన పాట రూపంలో ఇంకా బతికే ఉన్నారని తెలిపారు.

అలాగే మోహన్ బాబు ..సిరి వెన్నెల సీతారామశాస్త్రి… నాకు అత్యంత సన్నిహితుడు…
సరస్వతీ పుత్రుడు… విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది… ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.