హాంకాంగ్‌ భద్రతా చట్టానికి చైనా ఆమోదం

ఆమోదం తెలిపిన చైనా ప్ర‌తినిధుల స‌భ

China passes controversial national security law for Hong Kong

చైనా: వివాదాస్పద హాంకాంగ్ భ‌ద్ర‌తా చ‌ట్టానికి చైనా ఆమోద ముద్ర వేసింది. చైనా ప్ర‌తినిధుల స‌భ ఈ చ‌ట్టానికి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టంపై హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నప్పటికీ చైనా దీనికి ఆమోదం తెలపడం గమనార్హం. చైనా ప‌ట్ల హాం‌కాంగ్‌లో ఎలాంటి వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు జ‌రిగినా ఈ చ‌ట్టం ద్వారా క‌ఠినంగా శిక్షించ‌వచ్చు. ఈ చట్టంపై హాంకాంగ్‌ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాం‌కాంగ్ సిటీ గుర్తింపుకు ప్ర‌మాదం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాం‌కాంగ్ త‌న న్యాయ‌ స్వేచ్ఛ‌ను కోల్పోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కాగా, 1997 వరకు హాంకాంగ్‌ బ్రిటిష్ అధీనంలో ఉంది. అనంతరం అది చైనా చేతిలోకి వెళ్లింది. హాంకాంగ్‌లో వేర్పాటు వాదం, విదేశీ జోక్యాన్ని నివారిస్తామంటూ చైనా అక్కడి ప్రజల అన్ని రకాల స్వేచ్ఛలనూ హరించే విధంగా భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని, ఆదేశాలను ధిక్కరించినవారిని శిక్షించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/