వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్

ఖైరతాబాద్ మహా గణపతికి చెప్పులేసుకొని పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి బుధవారం నాడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. కవిత రాక సందర్బంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ దగ్గరుండి దర్శనం చేయించి, పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కవిత వచ్చిన హడావిడిలో దానం నాగేందర్ ఒక అపచారం చేశారు.

కవితతో కలిసి ఆ మహా గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే దానం దర్శన సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకోవడం ఇప్పుడు ఆయన్ను వివాదంలోకి నెట్టింది. ఈ విషయం కల్వకుంట్ల కవిత తన ఫేస్‌బుక్‌లో అందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేయడంతో బయటపడింది. దీంతో దానంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ గణేశుడు ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు.