కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘నారీ న్యాయ్ గ్యారెంటీ’ వివరాలు ఇవే..

congress-unveils-nari-nyay-guarantee-in-manifesto-to-attract-women-voters-lok-sabha-elections-2024

న్యూఢిల్లీః పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో… దేశవ్యాప్తంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ‘నారీ న్యాయ్ గ్యారెంటీ’ని ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏడాదికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ఆ గ్యారెంటీలో తెలిపింది. ఈ నగదును ప్రతి ఏటా పేదల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని వెల్లడించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50 శాతం కోటా ఇవ్వనున్నట్లు తెలిపింది.

‘మహాలక్ష్మి’, ‘ఆది ఆబది-పూరా హక్’, ‘శక్తి కా సమ్మాన్’, ‘అధికార్ మైత్రి’, ‘సావిత్రీబాయి ఫూలే హాస్టల్’ అనే ఐదు కీలక వాగ్ధాలను మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు రూ.1 లక్ష నగదు బదిలీ… ఆది అబది-పూరా హక్ కింద కేంద్ర ప్రభుత్వంలో చేపట్టే నియామకాల్లో 50 శాతం మహిళలకు ఇవ్వడం… శక్తి కా సమ్మాన్ పథకం కింద ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు… అధికార్ మైత్రీ పథకంలో న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార్ మైత్రి నియామకం… సావిత్రీబాయి పూలే హాస్టల్స్ పథకంలో భాగంగా ఉద్యోగం చేసే మహిళలకు రెట్టింపు హాస్టల్స్, ప్రతి జిల్లాలో కనీసం ఒక హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొత్త రిక్రూట్‌మెంట్ ప్రకారం నియామకాల్లో సగం హక్కు మహిళలకు ఉంటుందని పేర్కొన్నారు. నారీ న్యాయ్ పేరుతో ఖర్గే ఈ హామీలను ప్రకటించారు. మరోవైపు భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఈ గ్యారెంటీలకు సంబంధించి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.