అయ్యన్న ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

పంట కాల్వను ఆక్రమించి గోడను నిర్మించారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ నర్సీపట్నంలోని అయ్యనపాత్రుడి ఇంటి గోడను జేసీబీ లతో కూల్చారు. దీనిపట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా టీడీపీ అధినేత ఈ చర్య ను తీవ్రంగా ఖండించారు. చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత.. ముమ్మాటికీ కక్ష సాధింపేనని అన్నారు. టీడీపీ లో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయ్యన్న ప్రశ్నల్లో.. ఏ ఒక్కదానికీ జగన్ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరని చంద్రబాబు అన్నారు. అందువల్లే కూల్చివేతలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ఉంటామని తెలిపారు.

మరోపక్క అయ్యన్న అక్రమంగానే గోడ కట్టారని ఆధారాలు బయటపెట్టింది ఇరిగేషన్ శాఖ. రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్ నీలంపేట ఛానెల్ లో… నర్సీపట్నం పట్టణ పరిధిలోని శివపురం దగ్గర నీలంపేట ఛానెల్ కు గోడలు కట్టింది ఇరిగేషన్ శాఖ. సరిగ్గా ఈ గోడ కట్టిన చోటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి నిర్మాణం చేశారు. ఇరిగేషన్ శాఖ గోడల పైనే బేస్ మెంట్ నిర్మించారు. ఛానెల్ ఒడ్డున నదిలోకి పది అడుగుల వరకు ఆక్రమించారని తేల్చారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే… ఆ గోడను కూల్చేసినట్లు ఏపీ ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది.