చంద్రబాబు అరెస్ట్..టిడిపికే మేలు జరుగుతుందిః సీ ఓటర్ సర్వే

చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని అభిప్రాయపడ్డ 56 శాతం మంది

chandrababu-arrest-will-gain-sympathy-for-tdp-says-cvoter-survey

అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. బాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఆయనకు బెయిల్ రాలేదు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ఏపీలో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతోందనే విషయంపై సీఓటర్ చేసిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 2024లో జరబోతున్న ఎన్నికల్లో చంద్రబాబు అరెస్ట్ టిడిపికి భారీగా లబ్ధిని చేకూర్చబోతోందని సర్వేలో తేలింది. అరెస్ట్ అంశం చంద్రబాబుకు లాభిస్తుందని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు అరెస్ట్ టిడిపికి ఎంత వరకు లాభిస్తుందనే విషయంపై అన్ని పార్టీల మద్దతుదారులను సీఓటర్ సంస్థ సర్వే చేసింది. అరెస్ట్ చంద్రబాబుకు లాభిస్తుందని టిడిపి మద్దతుదారుల్లో 85 శాతం మంది చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారుల్లో కేవలం 36 శాతం మందే చంద్రబాబు జైలుకు వెళ్లడం జగన్ కు లాభిస్తుందని తెలిపారు. 64 శాతం మంది వైస్‌ఆర్‌సిపి మద్దతుదారులు చంద్రబాబు అరెస్ట్ టిడిపికే లాభిస్తుందని అభిప్రాయపడ్డారు. అరెస్ట్ చంద్రబాబుకే మేలు చేస్తుందని బిజెపి శ్రేణుల్లో ప్రతి ఐదు మందిలో ముగ్గురు తెలిపారు.

సర్వేలో పాల్గొన్నవారిలో మెజారిటీ వ్యక్తులు అరెస్ట్ వల్ల చంద్రబాబుకు సింపతీ భారీగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు సానుభూతి పెరుగుతుందని 56 శాతం మంది తెలిపారు. కాగా, ఈ సర్వేలో 1,809 మంది పాల్గొన్నారు.