ఈడీ చీఫ్ పదవి పొడిగింపుపై సుప్రీంకోర్టుకు కేంద్రం

Centre Urges Supreme Court to Extend Deadline for the Removal of Probe Agency Chief

న్యూఢిల్లీః ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. ఈ మేరకు తాజాగా పిటిషన్‌ వేసింది. సంజయ్ మిశ్రా పదవీ కాలం జులై 31తో ముగియనుండటంతో.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తాజా పిటిషన్ ను పరిశీలించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంను కోరారు. దీంతో తాజా పిటిషన్ ను విచారించేందుకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. దీనిపై ఈనెల 27న విచారణ జరపనుంది.

2018 నవంబర్ లో సంజయ్ కుమార్ మిశ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత ఆయనకు 60 ఏళ్లు రావడంతో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే, నవంబర్ 2020 లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి మూడేళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులను సవరించింది. అనంతరం 2022లోనూ మూడోసారి ఆయన పదవీ కాలాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ పలువురు నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సంజయ్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు కుదరదని స్పష్టం చేసింది. జులై 31 తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోవాలని.. ఆలోపు ఈడీకి కొత్త చీఫ్ ను నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.